Wednesday, July 31, 2019

పులుల ఆవాసాల జోలికి వెళ్లొద్దు

పులుల ఆవాసాల జోలికి వెళ్లొద్దు
01-08-2019 02:29:22
  • రోడ్ల నిర్మాణం, తవ్వకాలు చేపట్టకూడదు
  • జాతీయ పులుల సంరక్షణ సంస్థ సూచన
న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో 2006 నుంచి 2018 వరకు పుష్కర కాలంలో పులుల సంఖ్య రెట్టింపు అయిన నేపథ్యంలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) ఒక కీలక సూచన చేసింది. పులుల ముఖ్య ఆవాస ప్రాంతాల జోలికి వెళ్లకూడదని తెలిపింది. ‘‘అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు, గనుల తవ్వకం చేపట్టకూడదు. అంతేకాదు, పులుల కారిడార్లను అతి జాగ్రత్తగా అనుసంధానం చేయాలి’’ పేర్కొంది. పులుల కారిడార్లను నిర్వహించడానికి రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు పెద్ద సమస్యగా మారుతున్నాయని భారత వన్యప్రాణి విభాగం శాస్త్రవేత్త వైవీ ఝాలా తెలిపారు. పులుల ఆవాస ప్రాంతాలపై గనుల తవ్వకం పనులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మధ్య భారతంలో ఈ పరిస్థితి ఎదురవుతోంది. అయితే, దేశంలో ఎక్కడ పులుల ఉనికి ఉందో అక్కడే ఖనిజ సంపదా సమృద్ధిగా ఉందని ఎన్టీసీఏ అధికారి రాజేశ్‌ గోపాల్‌ తెలిపారు.
 
తెలంగాణలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అక్కడ సర్వే, తవ్వకాలకు రంగం సిద్ధమవుతుండటం గమనార్హం. ఈ అన్వేషణకు పర్యావరణ శాఖకు చెందిన ఫారెస్టు అడ్వైజరీ కమిటీ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పర్యావరణ శాఖ పరిధిలోకే వచ్చే ఎన్టీసీఏ సూచిస్తోంది.

No comments:

Post a Comment