Monday, July 15, 2019

అడవి సర్వ నాశనమే! (Andhrajyothi)

అడవి సర్వ నాశనమే!
15-07-2019 02:19:59

https://www.andhrajyothy.com/artical?SID=847133

దారే లేదు..
వృక్షాలను తొలగించకుండా యంత్రాలెలా తీసుకెళ్తారు?
తవ్వకాలెక్కడో కూడా చెప్పలేదు
వన్యప్రాణుల మనుగడకు ముప్పు
అమ్రాబాద్‌.. జీవవైవిధ్యమున్న ప్రాంతం
నల్లమలలో యురేనియం అన్వేషణపై రాష్ట్ర అటవీ శాఖ నివేదిక
హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ‘‘అమ్రాబాద్‌.. నల్లమలలోని ఈ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ దేశంలోనే అతిపెద్దది. దేశంలో అత్యంత జీవ వైవిధ్యమున్న ప్రాంతం కూడా ఇదే. పులులు, చిరుతలు, అడవి పందులు, కణుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, నెమళ్లు వంటి జీవరాశులకు ఇది నెలవు. ఇక్కడ యురేనియం నిక్షేపాలను అన్వేషించేందుకు అనుమతి ఇస్తే అడవి నాశనమే. వన్య ప్రాణుల సంరక్షణకు ఎన్నో ఏళ్లుగా పడిన శ్రమ వృథా అవుతుంది. అడవితో పాటు వన్య ప్రాణుల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది’’ అని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. ‘‘యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరపాలని భావిస్తున్న అటవీప్రాంతాల్లో నాలుగు బ్లాకులున్నాయి. ఈ మొత్తం బ్లాకుల విస్తీర్ణం 83 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ ప్రాంతం పూర్వపు నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో విస్తరించి ఉంది.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


ఈ నాలుగు బ్లాకుల్లో కొండలు, వివిధ రకాల అరుదైన వృక్ష జాతులు, జీవరాశులు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం కావడంతో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు వంటివి సంచరిస్తున్నాయి. ఇలాంటి అరణ్యంలోకి అడుగు పెట్టడం కష్టం. కాలిబాటలు కూడా లేవు. ఇలాంటి దట్టమైన అరణ్యంలోకి తవ్వకాల కోసం భారీ యంత్రాలను ఎలా తీసుకెళతారన్నది ప్రశ్నార్థకం. వృక్షాలను తొలగిస్తారా.. లేదా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇలాంటి విశిష్టమైన అటవీ ప్రాంతంలో ఖనిజాన్వేషణ జరిగితే భూమి కోతకు గురవుతుంది. అక్కడ సంచరించే జీవరాశులపై రసాయనాల ప్రభావం ఉంటుంది. భారీ గుంతలు ఏర్పడి వన్య ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. అంతేగాక జీవ వైవిధ్యానికీ విఘాతం ఏర్పడుతుంది’’ అని అటవీశాఖ స్పష్టం చేసింది.

నివేదికలో బ్లాకుల వారీగా వివరాలు
బ్లాకు 1
దీని విస్తీర్ణం 38 చదరపు కిలోమీటర్లు. ఇది అమ్రాబాద్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని మాచవరం బీట్‌ పరిధిలో ఉంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ బఫర్‌ ఏరియాలో ఇదొక భాగం. ఇందులోని 239, 240, 241 కంపార్ట్‌మెంట్‌లు కోర్‌ ఏరియాలోనే ఉన్నాయి. కొండలు, చెట్లు, ముళ్ల పొదలతో నిండి ఉంది. ఇక్కడ అడవిపందులు, కణుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతలు, పులులు వంటి జీవరాశులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తవ్వకాలకు భారీ యంత్రాలను తీసుకెళ్లడం అంత సులువుకాదు. తవ్వకాలు ఎక్కడ జరుపుతారో కూడా చెప్పలేదు. చెట్లను తొలగిస్తారా? లేదా? అనే విషయంలో కూడా స్పష్టత లేదు.

బ్లాకు 2
మొత్తం 38 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. అమ్రాబాద్‌ అటవీ రేంజ్‌లోని పాద్రా, మారేడుపల్లి బీట్‌ల పరిధిలో ఉంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పారె్‌స్టలోని రాజీవ్‌గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ బ్లాకు పరిధిలోనే ఉంది. ఇందులోని నల్లవాగు ప్రాంతంలో పులుల సంచారం ఉంటుందని చెబుతారు. కొండలు, గుట్టలతో కూడిన ఈ ప్రాంతంలోకి వెళ్లడానికి రహదారులు లేవు. యంత్రాలను తీసుకెళ్లి తవ్వకాలు జరపడంపై స్పష్టత ఇవ్వలేదు.

బ్లాకు 3
మొత్తం విస్తీర్ణం 3 చ.కి.మీ.లు. దేవరకొండ రేంజ్‌లోని కంబాలపల్లి బీట్‌లో ఉన్న 116 కంపార్ట్‌మెంట్‌ కిందకు వస్తుంది. ఇక్కడ రాజీవ్‌గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది. ఈ బ్లాకులోనూ ఎక్కడ తవ్వకాలు జరుపుతారనే దానిపై స్పష్టత లేదు.

బ్లాకు 4
మొత్తం విస్తీర్ణం 3 చ.కి.మీ.లు. ఇది కూడా దేవరకొండ రేంజ్‌లోని కంబాలపల్లి బీట్‌లో గల 117 కంపార్ట్‌మెంట్‌ పరిధిలోకి వస్తుంది. ఇందులోనూ రాజీవ్‌గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది. ఇక్కడ పలు రకాల వన్య ప్రాణులు సంచరిస్తున్నట్లు వివిధ నివేదికల్లో స్పష్టమైంది.

No comments:

Post a Comment