‘అణు’ ఆగ్రహంలో నల్లమల
01-08-2019 00:31:42
యురేనియం తవ్వకాలు కొనసాగితే నల్లమల నామరూపాలు లేకుండా పోతుంది. అడవి, చెట్లు, జీవరాసులు, కృష్ణానది చరిత్రపుటల్లో కలిసి పోతాయి. ఈ విధ్వంసకర అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడాలి. మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలు, యువకులు, మహిళలు, నల్లమలను కాపాడడానికి ఆదివాసీలు చేసే పోరాటానికి అండగా నిలవాలి.
నల్లమల మళ్ళీ ప్రముఖ వార్త అయింది. కర్నూలు, గుంటూరు, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలను కలిపి ఉంచిన దట్టమైన అటవీ ప్రాంతమే నల్లమల. ‘నల్ల’ అంటే నేల మొత్తం నల్లరేగడితో కప్పబడిన అడవులు, లోయలు. ‘మల’ అంటే కొండ. ఈ మొత్తం సమాహారాన్ని నల్లమల అంటారు. ఇది చెంచుల రాజధాని ఆవాసం. ఇక్కడ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. చెంచులు జంతువులు మానవ సంబంధ వరుసలతో సహజీవనం చేస్తుంటాయి.
మనోహరమైన ఈ ప్రకృతిపై భారత ప్రభుత్వ కన్నుబడింది. ఈ కన్ను పడిందంటే ఏదైనా సరే భస్మీపటలం కావాల్సిందే!. ఆ నేలను కుళ్ళ బొడిచి గర్భంలోని ఖనిజాన్ని వెలికి తీసే కార్యానికి పూనుకుంది. దీనితో మాటలు రాని అపారమైన వృక్ష, జంతు జాలాలు, ప్రకృతి, పర్యావరణం, నీరు, గాలి, నదులు కేంద్ర ప్రభుత్వ పంజాలో ఇరుక్కుని విలవిల్లాడుతున్నవి.
అక్కడ నివసించే ఆదివాసులకు మాటలొచ్చు. వారి గతమంతా దుర్భరమే. వర్తమానం తెలియదు. భవిష్యత్తు ఆశ లేదు. వీరి మాటల వెనుక మెదడుంది. వారి మెదళ్ళలో తెలంగాణ సాయుధ పోరాట గుర్తులు, నక్సలైటు ఉద్యమ పొరలు గూడు కట్టుకున్నవి. తత్ఫలితంగా వీరి మాటలు పదును గానే వున్నాయి. ‘‘మోదీ మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. ఈ గడ్డ మీది ఆకులు, అలాలు, గడ్డలు, కాయలు, పండ్లు తిన్నోళ్ళం అంత సులభంగా చావం. పోరాడి చస్తాం. మేం బతికిన ఈ గడ్డ మమ్మల్ని కాపాడుకుంటది. మా ఆవులకు, లేగలకు కొమ్ములున్నాయి మమ్మల్ని ఎలా కపాడుకోవాలో వాటికి బాగా తెలుసు. అని తిర్మలాపూర్ కు చెందిన అరవై మూడేళ్ళ నారమ్మ అంటుంటే అందరూ గొంతులు కలిపారు. యంత్రాలను, వాహనాలను అప్పర్ ప్లాటుకు ఎక్కనివ్వం. మోదీ మిలిటరీని పారదోలుతాం. ఈ అడవి మాది, అడవి సంపద మాది. మేమే అనుభవిస్తాం. మేం ఎక్కడికీ వెళ్ళి దేన్నీ యాచించం. మా దగ్గరికి వస్తే వూరుకోం. మైదాన ప్రాంతం నుండి ఎట్ల పైకి ఎక్కుతారో చూస్తాం. అక్కడే పాతి పెడతాం. మా మీద బాంబులు వేస్తారా? మేం బాణాలు వేస్తాం. కాచుకోండని’’ అమాయకపు చూపులు చూస్తూనే సర్పంచ్ ముత్తమ్మ (31) దృఢంగా అంటుంటే గ్రామస్థులంతా చప్పట్లు కొట్టారు. ఈ మాటల్లో రాజులతో, రాజ్యాలతో, విదేశీయులతో పోరాడిన చరిత్ర గలిగిన వారసత్వ పోరాట పటిమ, నిశ్చయం కనబడుతుంది. సాంప్రదాయ విల్లంబులు, అత్యాధునిక ఆయుధాలు తలపడనున్నాయి. పోరాటంలో ఎన్ని ప్రాణాల చుట్టూ తీతువులు తిరుగుతాయో? ప్రభుత్వాలు నిరుపేద ప్రజలను చంపడానికే అన్నట్టుంది భారత పాలకుల తీరు. వేలాది మందిని ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేసింది. పోలీస్ స్టేషన్ లాకప్పులో వేసి వందలాది మందిని కొట్టి చంపింది. విద్యుత్ చార్జీలు తగ్గించమన్నందుకు బషీర్ బాగ్‌లో ముగ్గురిని చంపేశారు. పశ్చిమ బెంగాల్ నందిగ్రాంలో సెజ్‌లను వ్యతిరేకిస్తే కాల్పులు జరిపి 14 మందిని చంపేశారు. మధ్యప్రదేశ్ మందసార్‌లో రైతుల పై కాల్పులు జరిపి 10 మందిని చంపేశారు. తమిళనాడు టటుకోరిన్‌లో కాలుష్యాన్ని తగ్గించమని ఉద్యమిస్తే ప్రజలపై కాల్పులు జరిపి ఇద్దరిని చంపేశారు. ఇప్పుడు నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని నల్లమల ఆదివాసీలు ఉద్యమిస్తే ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారోనని మేధావులు, ప్రజాతంత్ర వాదులు, సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య నిరంతరం జరుగుతున్న యుద్ధంలో బుద్ధి జీవులారా మీరెటువైపు అని మళ్ళీ ఒకసారి అడగాల్సిన సందర్భమిది. ఆదివాసీల పక్షాన నిలిచి విధ్వంసాన్ని నిలువరించాల్సిన సందర్భమిది.
తేనె తుట్టెను మొదటగా కదిలించింది కేంద్ర ప్రభుత్వమే. నిర్బంధం మొదటగా రాజ్యమే ప్రయోగిస్తుంది. ప్రతిఘటన ప్రతిస్పందన మాత్రంగానే వుంటుంది. యురేనియం తవ్వకాలకు అన్ని అనుమతులు వచ్చినట్లే. ఇక భారీ వాహనాలు, యంత్రాలు, బుల్‌డోజర్లు దిగాల్సి వుంది. పక్షుల కిలకిలా రావాలు వినబడాల్సిన చోట యంత్రాల హోరు మార్మోగుతుంది. పులులు గాండ్రించవు. ఇక యంత్రాలు గర్జిస్తాయి. పచ్చని అడవంతా ఒక్కసారిగా పారిశ్రామిక వాడగా మారుతుంది. ప్రజలు నిలువునా దుమ్మైపోతారు. పచ్చని అడవి తెల్లగా మారిపోతుంది. ఊహకందని భీకర దృశ్యాలు కనబడుతాయి. టైగర్ ప్రాజెక్టు యురేనియం ప్రాజెక్టుగా మారుతుంది. కృష్ణానది కలుషితమవుతుంది. హైదరాబాదు వాసులకు మంచినీరు బదులు విషపునీరు సరఫరా అవుతుంది. తెలంగాణలో నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు దెబ్బతింటాయి. తెలంగాణ ప్రాంత నల్లమల అడవిలోని రాతి పొరల్లో అట్టడుగు భాగాన యురేనియం నిక్షేపాలు దాగివున్నట్లు కనుగొన్న వెంటనే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తవ్వకాలకు సన్నద్ధమయ్యింది. గతంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుట్టు చప్పుడు కాకుండా యురేనియం ఖనిజాల కోసం రహస్య సర్వేలు నిర్వహించారు. డిబీర్స్ కంపెనీ వారు ఇప్పటికే 430 బోర్లు వేశారు. ఇంకా 4000 పై చిలుకు బోర్లు వేయడానికి సిద్దపడుతున్నారు. ప్రజలకు అనుమానం వచ్చి బోర్ల వాహనాలను ధ్వంసం చేస్తే అప్పుడు అసలు విషయం బయట పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 20 వేల టన్నుల యురేనియం 83 చ.కి.మీ. పరిధిలో విస్తరించినట్లు అంచనా వేశారు. కానీ, అది అంత వరకే పరిమితం కాదు. ఇంకా విస్తరిస్తుంది. ఎన్నికలు ముగిశాయి కనుక ఎన్ని ఆటంకాలు ఎదురైనా తిప్పి కొట్టి నిక్షేపాలను వెలికి తీస్తామనే ధీమాతో ప్రభుత్వం ఉంది. యురేనియం తవ్వకాలు ప్రజల ప్రయోజనాల కోసమని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుకుతుంది. 2030 నాటికి 40 వేల మెగావాట్ల అణువిద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అణు విద్యుత్ రియాక్టర్లకు ముడిసరుకు అయిన యురేనియం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్రం పైకి చెబుతోంది. కానీ, పాకిస్ధాన్ బూచి చూయించి అణు బాంబులు తయారు చేయడం అసలు ఉద్దేశం. ఈ అణుబాంబులు మానవాళికి ఎంత ప్రమాదకరమో చరిత్ర చెబుతోంది.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా పట్టణంపై అమెరికా యురేనియం బాంబు వేయడం వలన 80 వేల మంది చనిపోయారు. మళ్ళీ మూడు రోజుల తర్వాత నాగసాకి పట్టణంపై ఫ్లుటోనియం బాంబును వేయడంతో 75 వేల మంది చనిపోయారు. దాడి నుంచి బతికి బయటపడ్డ వారు ఆ తరువాత అనేక రోగాల బారిన పడి చనిపోయారు. 1986 ఏప్రిల్ 26న రష్యాలోని చెర్నోబిల్ అణు విద్యుత్ రియాక్టర్ పేలిపోయినపుడు వెంటనే 4 వేల మంది చనిపోయారు. 2 లక్షల 46 వేల చ.కి.మీ. ప్రాంతంలో అణుధార్మిక మూలకాలు విడుదలయ్యాయి. ఒక అంచనా ప్రకారం చెర్నోబిల్ అణు ప్రమాదంలో మొత్తం 9 లక్షల మంది చనిపోయారు. 2011 మార్చిలో జపాన్‌లోని ఫుకుషిమాలో పేలిపోయిన అణు విద్యుత్ రియాక్టర్లు సృష్టించిన భీభత్సం 80 కి.మీ. పరిధికి వ్యాపించింది. మానవ నిర్మిత అణురియాక్టర్లు మానవ తప్పిదాల వల్లనే ప్రమాదపుటంచులకు చేరుకుంటున్నాయి. 1952లో కెనడాలోని ఒంటారియోలో, 1979లో అమెరికాలో సంభవించిన త్రీమైల్ ఐలాండ్ ప్రమాదాలు అణు రియాక్టర్ల వల్ల ప్రమాదాలు తప్పవని సూచిస్తున్నాయి.
ఒక అధ్యయనం ప్రకారం అణు విద్యుత్ రియాక్టర్ల వలన ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 10 వేల మెట్రిక్ టన్నుల అణు వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 15 శాతం మాత్రమే శుభ్రపరుస్తున్నారు. దీన్ని ఎక్కడ దాచాలో దిక్కు తోచని స్థితి. ఇది ప్రమాద రహితం కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. మిగిలిన 85 శాతాన్ని శుభ్రపరచకుండా వదిలేసిందే. ఇది ప్రమాద రహితం కావడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఈ వ్యర్థాలను పూడ్చడానికి ముఖ్యంగా మన దేశంలో స్థలమెక్కడిది? పూడ్చిన ప్రాంతాలు సంవత్సరాల తరబడి పనికిరాకుండా పోతాయి. ప్రమాద రహితం చేయడం, పూడ్చే మానవ రహిత ప్రాంతాన్ని వెతుక్కోవడం ఏ దేశానికైనా తలకు మించిన భారం. ఒక్క అణు రియాక్టరు వెయ్యి మెగావాట్ల విద్యుత్తుకు 30 టన్నుల అణు వ్యర్ధాలను విడుదల చేస్తుంది. అదే విధంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న అణు విద్యుత్తు రియాక్టరు 10 నుంచి 15 అణుబాంబుల తయారుకు సరిపడే ప్లుటోనియం ఉత్పత్తి చేస్తుంది. ఆ అణ్వాయుధాలు ప్రయోగించినపుడు జీవరాసులకు హానికరమైన స్ట్రాన్షియం, యురేనియం, సీసియం లాంటి అణుధార్మిక మూలకాలు విడుదలవుతాయి. వీటివల్ల కాన్సర్, చర్మ వ్యాధుల్లాంటి అనేక రోగాలు సంభవిస్తాయి. ఇవే ప్రమాదకర మూలకాలు విద్యుత్ ఉత్పత్తి క్రమంలో కూడా వెలువడుతాయి. ఇంత వినాశనానికి దారి తీసే అణు విద్యుత్ ఉత్పత్తి మనకు అవసరమా!
అణు రియాక్టర్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి గాను 60 గ్రామాల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. తత్ఫలితంగా భూమండలం వేడెక్కుతుంది. గ్లోబల్ వార్మింగ్ వలన ప్రమాదకర మార్పులు ఏర్పడి జీవరాసుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. అణు విద్యుత్ ప్రక్రియ ప్రమాదం అని గ్రహించాక పలు దేశాలు ఉత్పత్తిని నిలిపి వేశాయి. కాని ఏ ఒక్క దేశం కూడా అణు రియాక్టర్లను పూర్తిగా నిషేధిస్తామని ప్రకటించలేదు. మన దేశంలో 22 అణు విద్యుత్ రియాక్టర్లు వున్నాయి. వీటిన్నిటికి అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ దృష్టిలో పడకుండా యురేనియంను సరఫరా చేస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ కేంద్రం నుంచి వెలికి తీసిన యురేనియంను ప్రధానంగా సప్లై చేస్తుంది. దాని చుట్టూ నివసిస్తున్న 50 వేల మంది ప్రజలు క్యాన్సర్ ఇతర రోగాల బారిన పడి చిక్కిశల్యమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు గర్భస్రావాలకు గురౌతున్నారు. ఇంత వినాశనానికి ఒడిగట్టి ఉత్పిత్తి చేసే అణు విద్యుచ్ఛక్తి మొత్తం ఉత్పత్తిలో ఇప్పటి వరకు 3 శాతం గానే నమోదైంది. ఉత్పత్తి ఖర్చు గణనీయంగా పెరిగింది. కెనడా, కజకిస్తాన్, జపాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఖర్చు చాలా తగ్గుతుంది. అణు రియాక్టర్ల నిర్మాణం తప్పిస్తే విద్యుత్తు ఉత్పత్తికి వేరే మార్గాలు లేవా? ఇపుడు లభ్యమవుతున్న విద్యుత్తుకు కొరత ఏర్పడిందా? దేశంలో విద్యుచ్ఛక్తి మిగులుగా వుంది. ప్రపంచ దేశాలన్ని సోలార్ ఎనర్జీ వైపు మొగ్గు చూపుతున్నాయి. మన దేశంలో కూడా ఈ ప్రక్రియ మీద మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు జరగాలి.
యురేనియం తవ్వకాల పేరుతో, అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం పేరుతో సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థలు చొరబడుతున్నాయి. అమెరికా, ప్రాన్స్, అర్జెంటీనా ఇప్పటికే తిష్టవేశాయి. నల్లమలకు డిబీర్స్ వచ్చేసింది. యురేనియం తవ్వకాలు కొనసాగితే నల్లమల నామరూపాలు లేకుండా పోతుంది. అడవి, చెట్లు, జీవరాసులు, కృష్ణానది చరిత్రపుటల్లో కలిసి పోతాయి. ఈ విధ్వంసకర అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడాలి. మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలు, యువకులు, మహిళలు, నల్లమలను కాపాడడానికి ఆదివాసీలు చేసే పోరాటానికి అండగా నిలవాలి.
లక్ష్మణ్ గడ్డం
పౌరహక్కుల సంఘం