కేంద్రం కీలక నిర్ణయం : ఈ-సిగరెట్లపై నిషేధం
Sep 18, 2019, 15:50 IST
Union Cabinet Approves Ban E Cigarettes Says Nirmala Sitharaman - Sakshi
ఎలక్ర్టానిక్ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ర్టానిక్ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ వివరాలను వెల్లడించారు. దేశంలోని యువతపై ఈ-సిగరెట్లు చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని, దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ, వాడకంపై నిషేధం విధిస్తున్నాం. వాటిపై ప్రకటనలు, విక్రయం కూడా ఇక నేరమే. దీనికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది’ అంటూ కేబినెట్ నిర్ణయాలను నిర్మలా వివరించారు. పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట‍్లను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.
ఈ-సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ సిగరెట్లను కలిగిఉంటే ఆరు నెలల వరకూ జైలు శిక్ష రూ 50,000 జరిమానా విధించేలా వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. కేంద్ర కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌కు బుధవారం ఆమోదం తెలిపింది.
No comments:
Post a Comment