ఊళ్లన్నీ విషమే!
16-09-2019 03:27:57
కాలకూటం చిమ్ముతున్న తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం
పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు కలుషితం
భూములు నిస్సారం.. పండని పంటలు
మరింత లోతుకు భూగర్భ జలాలు
500 ఫీట్లకు బోరు వేసినా చుక్క రాదు
దండగగా మారిన యవుసం
ఎకరం ధర రూ.50 వేలలోపే
అయినా భూములను కొనేదిక్కులేదు
రోగాల బారిన పడుతున్న ప్రజలు
పెరుగుతున్న కేన్సర్, కిడ్నీ బాధితులు
అక్కడి ఊర్లకు పిల్లనివ్వాలంటేనే జంకు
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 15: అది ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరానికి 105కిలోమీటర్లలోని రమ్ జంగల్ ప్రాంతం. 1970లో అక్కడ రెండు యురేనియం బావులను తవ్వారు. 1971లోనే పనులను ఆపేశారు. 48 ఏళ్లు గడిచినా పర్యావరణపరంగా ఇప్పటికీ అది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమే! యురేనియం వ్యర్థాలతో దీనికి దగ్గర్లోనే ప్రవహించే ఫిన్నిస్ నది పూర్తిగా కలుషితమైపోయింది. అచ్చంగా బ్రెజిల్‌లోని అంటాస్ రిజర్వాయర్ తరహాలోనే! యురేనియం తవ్వకాలు జరపడమంటే అది దిద్దుకోలేని తప్పేనని బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాల అనుభవాలు గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఎక్కడో ఉన్న ఆ దేశాల గురించి ఎందుకు? యురేనియం తవ్వకాలతో చోటుచేసుకున్న విపరిణామాలకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉదాహరణ. మహబూబ్‌నగర్‌కు కేవలం 325కిలోమీటర్ల దూరంలోని కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో 13ఏళ్ల క్రితం యురేనియం శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పారు. శుద్ధితో వెలువడిన అత్యంత హానికరమైన రేడియోధార్మికత అక్కడి ప్రజల బతుకులను ఛిద్రం చేసింది.
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM
Supermoon - Ft. Russell Peters World Tour.
Pune | Ahmedabad | Hyderabad Oct 1st - Oct 6th
Book Now
తుమ్మలపల్లి దాని పరిసర గ్రామాలైన మబ్బుచింతలపల్లి, రాసుకుంటపల్లి, భూమయ్యగారి పల్లి, కొట్టాల, కన్నంపల్లి తదితర ఎన్నో గ్రామాల్లో పీల్చేగాలి.. తినే తిండి.. తాగేనీరు అన్నీ కలుషితమైపోయాయి. ఊపిరితిత్తుల కేన్సర్, కిడ్నీ వ్యాఽధి బాధితులు పెరిగారు. మునుపు మిర్చి, పత్తి పంటలు పండేవి. సారం దెబ్బతిని భూములు గుల్లగా మారాయి. సాగు పనులే బంద్ అయ్యాయి. యురేనియం కోసం నల్లమల కొండలను తొలిస్తే.. తుమ్మలపల్లి మాదిరి విపరిణామాలనే తెలంగాణ ఎదుర్కొనే ప్రమాదం ఉంది. చేజేతులా జీవన విధ్వంసానికి బాటలు పరిచినట్లే అవుతుంది.
తుమ్మలపల్లి.. ఆ సమీప గ్రామాల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే! యురేనియం కర్మాగారం మా బతుకులను తినేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నా ఒళ్లంతా రోగాల పుట్టగా మారింది. నరాలు చచ్చుబడిపోతున్నాయి. నాకు రెండుసార్లు పక్షవాతమొచ్చింది. మావోడు గోపిరెడ్డికి నిండా 30 ఏళ్లులేవు.. షుగరొచ్చింది. ఊపిరితిత్తుల కేన్సర్, మూత్రపిండాల వ్యాధి బాధితులు పెరిగిపోతున్నారు. కాళ్ల నొప్పులు, బీపీతో బాధపడుతున్న వారి గురించి లెక్కేలేదు’ తుమ్మలపల్లికి చెందిన ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి గోడు ఇది! ఈ తరహా అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అక్కడ ఎందరో ఉన్నారు. 2.75లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపడితే నాగర్‌కర్నూల్, కర్నూలు, నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రజాజీవితం, వాతావరణ సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తల ఆందోళన నేపథ్యంలో తుమ్మలపల్లి.. ఆ సమీప ప్రాంతాల్లోని ప్రజల స్థితి గతులను ‘ఆంధ్రజ్యోతి’ నాగర్‌కర్నూల్ జిల్లా బృందం పరిశీలించింది.
ముప్పులేదని మాటిచ్చి..
2006లో రూ. 1,106 కోట్లతో తుమ్మలపల్లిలో దాదాపు పది లక్షల టన్నుల ముడి యురేనియాన్ని శుద్ధి చేసే ప్లాంటును నెలకొల్పారు. యురేనియం వ్యర్థాలతో వెలువడే విష రసాయనిక పదార్థాల నుంచి పర్యావరణానికి ముప్పు లేకుండా చేస్తామంటూ అప్పట్లో యూసీఐఎల్ పేర్కొంది. ఈ మాటలకు, వాస్తవపరిస్థితులకు పొంతన లేదనే సంగతి కొన్నాళ్లకే స్పష్టమైంది. యురేనియం ప్రాసెసింగ్ కేంద్రంలో స్థానిక యువతకే ఉపాధి కల్పిస్తామంటూ భరోసా ఇవ్వడంతోనే.. ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు గ్రామస్థులు అంగీకరించారని మ బ్బుచింతలపల్లి గ్రామస్థుడు రామిరెడ్డి తెలిపారు. 2006కు మునుపు పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటలను సాగు చేస్తూ సాఫీగా జీవనం కొనసాగించామని.. కర్మాగారం ఏర్పాటైన తర్వాత పంటలే పండటం లేదని శివరామిరెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. భూమి పొరల్లో రసాయన వ్యర్థాలు చేరడంతో మొత్తంగా సాగే కుదేలైందన్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పడిపోయాయి. భూములను అమ్ముకుందామన్నా కొనేందుకు ఎవరూ రావడం లేదన్నారు. ఎకరా రూ.50వేలకు కూడా భూములను కొనే పరిస్థితి లేదు. వ్యర్థాలు వెదజల్లే కాలుష్యంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో చాలా మంది మూత్రపిండాల వ్యాఽధులు, ఊపిరితిత్తుల క్యేన్సర్‌కు గురై రోజులు లెక్కపెడుతున్నారు. ఇక్కడ తాగునీటి సౌకర్యం కోసం చిత్రావతి నుంచి పైపులైన్ ద్వారా నీళ్లందించే ప్రక్రియ సజావుగా సాగడం లేదు. మూత్ర పిండాల వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని వైఎ్‌సఆర్ కడప జిల్లా రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేసిన రామ్‌కిషన్ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.
‘ఆంధ్రజ్యోతి’ని అడ్డుకున్న వైసీపీ నేత
తుమ్మలపల్లిలోని యురేనియం ప్లాంట్‌ను పరిశీలించేందుకు వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ నాగర్‌కర్నూలు జిల్లా బృందాన్ని వైసీపీ నాయకుడు ఆనందులరెడ్డి అడ్డుకున్నారు. యూనిట్‌లో పనిచేస్తున్న ఆయన అక్కడికి ఎవరూ రావడానికి అనుమతి లేదని, ‘ఆంధ్రజ్యోతి’ విలేకరులు ఎందుకు వచ్చారని దురుసుగా ప్రవర్తించారు. కెమెరాలోని ఫొటోలను తీసివేయించారు. వెనుతిరిగిన విలేకరుల వాహనం వెనుక సుమారు 8 కిలోమీటర్ల వరకు అనుసరించారు.
అబ్బాయిలకు పెళ్లిళ్లు జరగడం లేదు
యురేనియం ప్రాజెక్టు నెలకొల్పిన తర్వాత వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడం, భూముల విలువ పడిపోవడం, ప్రజలకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో స్థానిక యువకులకు పెళ్లి సంబంధాలు కుదరడం సమస్యగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు తెలిసి చాలామంది ఇక్కడి ఊర్లకు తమ అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటున్నారు.
పస్తులుంటున్నం
యురేనియం ఫ్యాక్టరీ తెచ్చి మమ్ముల పస్తుల్లోకి నెట్టినారు. ప్రాజెక్టు రాకముందు కూలి పనులతో సంసారం గడిచేది. ఇప్పుడు ఏడాదిలో నెల రోజులే కూలి పని దొరుకుతోంది. అది కూడా రోజుకు రూ.100 ఇస్తున్నారు.. ఇట్లయితే మేం ఎట్ల బతికేది?
- రమాదేవి, కూలీ, తుమ్మలపల్లి
నీళ్లు గొంతులో పోసుకోలేం
మా ఊర్లో నీళ్ళు తాగడానికి పనికి రావు. ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఒంటి మీద దురద, దద్దుర్లు వస్తున్నాయి. తాగేనీళ్లను 30కిలోమీటర్ల దూరంలోని తార్ణపల్లికి నుంచి సరఫరా చేస్తున్నరు. ప్రాజెక్టులో ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారు.
- పురుషోత్తం రెడ్డి, నిరుద్యోగి, తుమ్మలపల్లి
మా జీవితాలు సర్వనాశనం
ఒకప్పుడు బాగా బతికినోళ్లమే. యురేనియం ప్రాజెక్టుతో మా జీవితాలే సర్వనాశనమయ్యాయి. మునుపు బోరువేస్తే 90 ఫీట్లకే నీళ్లు పడేవి. ఇప్పుడేమో 500 ఫీట్లు వేసినా చుక్కనీళ్లు రావడం లేదు. నేను రెండు బోర్లు వేసిన. నీళ్లు రాలేదు. భూములను అమ్ముకుందామనుకున్నా కొనే దిక్కులేరు.
- శివరామిరెడ్డి, రైతు, తుమ్మలపల్లి