Tuesday, November 26, 2024

AP IT Policy CM Chnadrababu

 ఐటిలో మేటి 

CM Chandrababu : ఐటీలో మేటి

ABN , Publish Date - Nov 27 , 2024 | 03:47 AM


రాష్ట్రాన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉన్నత స్థానంలో నిలిపేలా పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు.

రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పలు కార్యక్రమాలు

అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం

2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌ స్టేషన్లు

ఐటీ డెవలపర్లకు కేటగిరీల వారీగా రాయితీలు

జోనల్‌ హబ్‌లతో ఐఐటీల అనుసంధానం

యువతలో నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు

పలు వర్గాల స్టార్ట్‌పలకు 25 లక్షల వరకు సబ్సిడీ

కొత్త ఐటీ పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉన్నత స్థానంలో నిలిపేలా పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. నూతన టెక్నాలజీ ప్రయోజనాలను రాష్ట్రం అందిపుచ్చుకునేందుకు పలు రాయితీలు ప్రకటించారు. 

ఐటీ రంగానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, ఐటీ డెవలపర్లకు ఇచ్చే సబ్సిడీలు ఎలా ఉండాలో కూడా స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం కొత్త ఐటీ పాలసీ 2024-29పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి.. గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐదేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగానికి సదుపాయాలు, రాయితీలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఐటీ పాలసీపై మానవనరుల అభివృద్ధి, ఐటీ, ఎలకా్ట్రనిక్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు.

భవిష్యత్‌ అంతా డీప్‌ టెక్‌దే

రాజధాని నగరం అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐటీ ఐకానిక్‌ భవనాన్ని నిర్మించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. యువత భవిష్యత్తు అంతా డీప్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి నూతన టెక్నాలజీలపైనే ఆధారపడి ఉందని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం డీప్‌ టెక్నాలజీతో కలుగుతున్న ప్రయోజనాలను అందిపుచ్చుకునేలా ఆ ఐకానిక్‌ భవనం ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

2029 నాటికి ఐదు లక్షల వర్క్‌ స్టేషన్లు

ఐటీ రంగానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై కొత్త ఐటీ పాలసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. 2029కల్లా రాష్ట్రంలో ఐదు లక్షల వర్క్‌ స్టేషన్లు, 2034కల్లా పది లక్షల వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకోవాలని పనిచేయాలన్నారు. కో-వర్కింగ్‌ స్పేస్‌లు, కార్యాలయాల సముదాయాలు నిర్మాణానికి అవసమైన భూములు సబ్సిడీపై లీజుకివ్వడంతో పాటు సింగిల్‌ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్‌ పవర్‌ టారీఫను అమలు చేయాలని స్పష్టం చేశారు. స్టార్టప్‌ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ. 25 లక్షల వరకు మూలధన సబ్సిడీని ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఐఐటీలతో ఇన్నోవేషన్‌ అనుసంధానం

అమరావతిలో స్థాపించే రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు ఐఐటీలను అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఐదు జోనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటుపైనా ఈ ఉన్నతస్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా ఐదు ప్రాంతాల్లోనూ జోనల్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని.. వాటికి ప్రధాన కేంద్రంగా అమరావతిలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. ఆ జోనల్‌ హబ్‌లకు దేరీశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చేయాలని ఆదేశించారు.

ఉద్యోగ కల్పనే లక్ష్యం

ఐటీ పాలసీ అమలులో భాగంగా నెలవారీ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా సమీక్షలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పాలసీ ప్రకటన తర్వాత వర్క్‌స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను జిల్లా కలెక్టర్లు కూడా గుర్తించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సహకారంతో రాష్ట్రంలో ఎంతమంది వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారో గుర్తించాలన్నారు. తద్వారా అయా ప్రాంతాల్లో వర్క్‌స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. వర్క్‌స్టేషన్లకు వచ్చి పని చేసుకునేవారికి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా స్కిల్‌ అప్‌గ్రేడేషన్‌ చేయాల్సి ఉందన్నారు. గ్రామాల్లో పరిజ్ఞానం ఉండి సరైన స్కిల్స్‌ లేకపోవడంతో రాణించలేకపోతున్న యువత చాలా మంది ఉన్నారని, వారిలో నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు.

సీట్ల సామర్థ్యం ప్రకారం ఐటీ రాయితీలు

ఐటీ డెవలపర్లలకు కేటగిరీల వారీగా రాయితీలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. డెవలపర్లను మూడు కేటగిరీలుగా విభజించి కోవర్కింగ్‌, నైబర్‌హుడ్‌ వర్కింగ్‌ స్పేస్‌, ఐటీ క్యాంప్‌సలకు వాటి సీట్ల సామర్థ్యం, కార్యాలయ సముదాయం విస్తీర్ణానికి అనుగుణంగా ఆ సబ్సిడీలను ఇస్తామని తెలిపారు. 

కోవర్కింగ్‌ స్పేస్‌కు సబ్సిడీ పొందాలంటే కనీసం 100 సీట్ల సామర్థ్యంకానీ.. పదివేల చదరపు అడుగుల కార్యాలయ సముదాయంకానీ కావాలని చెప్పారు. 

నైబర్‌హుడ్‌ వర్కింగ్‌ స్పేస్‌లకు పది సీట్ల సామర్థ్యం, లేదా వెయ్యి చదరపు అడుగుల కార్యాలయ సముదాయం ఉండాలన్నారు. 

ఐటీ క్యాంప్‌సకు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. 

ఏటా రూ. 30 కోట్ల టర్నోవర్‌ లేదా వంద మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తుది ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Nov 27 , 2024 | 03:48 AM

No comments:

Post a Comment