Tuesday, January 9, 2024

Fight against AI

 కృత్రిమ మేధపై పోరు తప్పదు!

ABN , Publish Date - Jan 09 , 2024 | 02:17 AM

సృష్టికి ప్రతి సృష్టి చేస్తోంది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఎఐ). ఇదొక విప్లవాత్మక పరిణామం– ముఖ్యంగా సమాచార రంగంలో. చాట్ జిపిటి, ఇతర ఎఐ వేదికలను సృష్టిస్తున్న, ఉత్పత్తి చేస్తున్న ఓపెన్ ఎఐ, మైక్రోసాఫ్ట్ కంపెనీలపై విఖ్యాత మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్’ కోర్టులో దావా వేసింది. తాము సంచితం చేసిన అపార పాత్రికేయ సమాచారాన్ని తమ అనుమతి లేకుండా చాట్ జిపిటి స్వేచ్ఛగా వినియోగించుకోవడం న్యాయవిరుద్ధమని ఆ సుప్రసిద్ధ పత్రిక ఘోషిస్తోంది. తమ వ్యాసాలు, వార్తలను విరివిగా వినియోగించుకుంటున్నందుకు చాట్ జిపిటి ఉత్పత్తిదారులు తమకు వందల కోట్ల డాలర్ల (ఈ మొత్తం కచ్చితంగా ఎంత అనేది ఇదమిత్థంగా తెలియదు)ను చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో అసంఖ్యాక ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోనున్నారు. అయితే ఈ ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య పోరాటాల కంటే తమ మేధాసంపత్తి హక్కులను కాపాడుకునేందుకు ఆ అమెరికన్ మీడియా సంస్థ చేస్తున్న న్యాయపోరాటం చాలా ప్రత్యేకమైనది. న్యాయ నిర్ణయం ఎలా ఉంటుందనే విషయమై సకల దేశాల ప్రజలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

మీడియా సంస్థలే కాదు, పలువురు సృజనశీలురు కూడా వైయక్తికంగానూ సమష్టిగానూ ఎఐ కంపెనీలపై తమ మేధో శ్రమను అనుమతి లేకుండా ఉపయోగించుకుంటున్నందుకు భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ న్యాయ స్థానాలకు వెళ్లారు. ‘హాలీవుడ్ రిపోర్టర్’ ఎడిటర్ జూలియన్ శాంక్టన్ నేతృత్వంలో పలువురు సాహిత్యేతర గ్రంథ రచయితలు ఒక కేసు వేశారు. ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కార గ్రహీతలు కూడా ఎఐ కంపెనీలపై వ్యాజ్యాలలో భాగస్వాములు అవుతున్నారు. ప్రముఖ రచయితలు జోనాథన్ ఫ్రాంజెన్, జార్జి ఆర్ఆర్ మార్టిన్, జాన్ గ్రిషామ్‌లు ఈ వ్యాజ్యదారులలో అగ్రగాములుగా ఉన్నారు. కృత్రిమ మేధ నుంచి తమ వృత్తిగత మనుగడకు ఎనలేని ముప్పు వాటిల్లుతుందని హాలీవుడ్ సృజనాత్మక, సాంకేతిక కళాకారులు ఆందోళన చెందుతున్నారు. వీరు ఇప్పటికే సమ్మెలు చేసి, నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఎఐతో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను విశాల ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. ఎఐ కంపెనీలకు వ్యతిరేకంగా న్యూయార్క్ టైమ్స్ చేస్తున్న న్యాయపోరాటమే, మరే వ్యాజ్యం కంటే కూడా ఎక్కువగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దశాబ్దాలుగా ఆ పత్రిక తన పాత్రికేయ ప్రజ్ఞతో సంచితం చేసిన అపార సమాచారాన్ని చాట్ జిపిటి తన కార్యకలాపాలకు అనుమతి లేకుండా ఆధారం చేసుకోవడమే అందుకు కారణమని మరి చెప్పనవసరం లేదు.

సాహిత్యం, తత్వ శాస్త్రం, వేవ్ మెకానిక్స్, విండ్ సర్ఫింగ్ మొదలైన సమస్త వైవిధ్య జ్ఞాన రంగాలకు సంబంధించి ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్న సమాచారాన్ని చాట్ జిపిటి స్వేచ్ఛగా వినియోగించుకుంటుంది. ఈ స్వేచ్ఛా వినియోగమే ఎఐకు తీవ్ర సవాళ్లను, న్యాయపరమైన సమస్యలను తీసుకువస్తోంది. దాని న్యాయబద్ధతను ప్రశ్నించేలా చేస్తోంది. వైజ్ఞానిక కాల్పనిక సాహిత్య దిగ్గజం ఐజాక్ అసిమోవ్ (1920–92) 1942లో రచించిన ‘రన్ ఎరౌండ్’ అనే కథలో ప్రస్తుత పరిణామాన్ని ఊహించారు. ‘రోబోటిక్స్ మూడు నియమాల’ను ఆయన ఆ కథలో ప్రకటించారు. ఆ మూడింటిలో మొదటి సూత్రం ఒక రోబో ఒక మనిషికి హాని చేయబోదు లేదా నిష్క్రియాపరత్వంతో ఒక మనిషి తనకు హాని చేసేందుకు అనుమతించదు’. మిగతా రెండు నియమాలు దీని నుంచి నిష్పన్నమైనవే. మానవుల పట్ల రోబోలు హింసాత్మకంగా ప్రవర్తించడాన్ని అనుమతించకూడదన్న సత్య వచనాన్ని పలు తరాల పాఠకులు చదువుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు భిన్నమైనవి హింసకు ఇచ్చే నిర్వచనం ప్రకారం దాని పరిధిని విశాలం చేయవచ్చు. మానవుల విశిష్టతకు ముప్పు కలిగించే విధంగా యంత్రాలను అనుమతించకూడదన్న అర్థంలో అసియోవ్ మొదటి నియమాన్ని చదవండి. అప్పుడు కృత్రిమ మేధపై జరుగుతున్న చర్చ వాస్తవికంగా లేదని అర్థమవుతుంది.

ఒక ఏడాది కాలంలోనే ఎఐ అనేక రంగాలలో ఉద్యోగాలను మటు మాయం చేయనున్నదనే విషయమై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అది ఆర్థికపరమైన ఆందోళన మాత్రమే. ప్రతీ సాంకేతిక విప్లవమూ అనేక విషయాలను అనావశ్యకం చేస్తుంది. కంప్యూటర్ విప్లవం గురించి చెప్పేదేముంది? టైపిస్టులు, టెలిఫోన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్లు, డేటా టాబ్యులేటర్లు, అకౌంటెంట్స్ అవసరం లేకుండా చేసింది. ఈ మార్పునే ఎఐ విప్లవం మరింత తీవ్రం చేస్తోంది. సాంకేతిక విప్లవాలు ఆర్థిక వ్యవస్థల్లో పెనుమార్పులను అనివార్యం చేస్తాయి. ఆ మార్పులు అల్లకల్లోలంగా ఉండడం కద్దు. విప్లవాత్మక మార్పు సంభవించిన కొద్దికాలానికే దాని మూలంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సర్వసాధారణమైపోతాయి. ప్రజలు వాటికి అలవాటుపడతారు. తమ శ్రమకు మరింత ప్రతిఫలం లభించే ప్రదేశాలకు కొంతమంది కార్మికులు వెళతారు. మరి కొంతమంది శ్రామికులు కొత్త పని వాతావరణంలో ఇమడలేక పాతకాలం చేతివృత్తులు మొదలైన వాటిని తమ జీవనాధారాలుగా చేసుకుంటారు. కొత్త సాంకేతికతలు ప్రభవించిన ప్రతీ సందర్భంలోనూ ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక వ్యవహారాలలో క్రియాశీలంగా ఉన్నవారికి అవి కొత్త కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. వారు నిర్వహించే పాత్రలను మార్చివేస్తాయి. వారిపై బృహత్ కార్యభారాన్ని మోపుతాయి. ఈ అనూహ్య పరిస్థితులను తట్టుకుని నిలబడినవారు కొత్త సాంకేతికతను తమకు సహాయకారిగా పరిగణిస్తారు. రైతులు సాగు పనులను పర్యవేక్షించడానికే పరిమితం కాకుండా హార్వెస్టర్ల (కోతలు, నూర్పిళ్ల యంత్రాలు) డ్రైవర్లుగానూ పనిచేయవలసిరావడం తప్పనిసరి అవుతుంది. గృహ సేవకులు మైక్రోవేవ్ ఓవెన్ల, వాషింగ్ మెషీన్లను ఉపయోగించుకోవడం నేర్చుకుంటారు. చెప్పవచ్చిన దేమిటంటే చాట్ జిపిటి రంగంలోకి ప్రవేశించిన తరువాత దాని వినియోగదారులు అది నిర్దేశించే కొత్త కార్య సరళికి అలవాటుపడ్డారు. ఆవశ్యక నవీన నైపుణ్యాలను నేర్చుకున్నారు.

సమాచార రంగంలో వినూత్న సంచలనాలకు వేదిక అయిన చాట్ జిపిటిలో మనకు తరచు వచ్చే మొదటి ఆదేశం : ‘నీవు నా సహాయకుడువి అని భావించుకోండి’. రేడియాలజీ నుంచి ఓషనోగ్రఫీ దాకా, డేటా ఎంట్రీ నుంచి ఈ–మెయిల్ మార్కెటింగ్ దాకా వివిధ రంగాలలో మనకు ఆ నవీన సాంకేతికత అనేకానేక విధాలుగా సహాయపడుతుంది. అయితే ఆ సహాయ చర్యలు చచ్చే చికాకు కలిగించేవి అని కూడా మనం గుర్తించాలి, అంగీకరించాలి.

సరే, మేధో సంపత్తి సంబంధిత వాణిజ్య రంగంలోకి ఎఐ ప్రవేశం ఉత్తేజాన్ని కలిగించింది; వ్యాకులతను సృష్టించింది; ఆరాటాన్ని పెంపొందించింది. సృజనశీలుర సొంత మేధో ఉత్పత్తులను అది అపారంగా నిక్షిప్తం చేసుకోవలసి ఉన్నది. ఎందుకంటే వినియోగదారుడు (యూజర్) అడిగిన సమాచా రాన్ని సమకూర్చడానికి చాట్ జిపిటికి ఏదో ఒక మేధో సంపత్తి ఆధారం ఉండి తీరాలి. ముందుగా నిక్షిప్తం చేసిన సమాచారం ప్రాతిపదికన అది సమాధానాలు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఇలా వినియోగదారుల ప్రశ్నలకు చాట్ జిపిటి ప్రతిస్పందనలు దాని సొంత మేధో సంపత్తిగా ఆవిర్భవిస్తాయి. అయితే మేధో సంపత్తిని సృష్టించే సృజనశీలురు ఈ ఎఐ ఉత్పత్తుల తీరుతెన్నులను సహజంగానే ఆక్షేపిస్తారు. ఎందుకంటే అది ఒక విధమైన చౌర్యం. ఎఐ చాలా ఉద్యోగాలను మటుమాయం చేయడం, డిజిటల్ టెక్నాలజీ తోడ్పాటుతో నకిలీ ఫోటోలు, దృశ్యాలు, గళాలు సృష్టించడం మొదలైనవి నూటికి నూరుశాతం వాస్తవాలు, అంతకు మించి ఎంతో ఆందోళనకర వ్యవహారాలూ పరిణామాలూ. ఇవన్నీ ఎఐ పుణ్యమేనని మరి చెప్పనవసరం లేదు. ఈ నకిలీ సృష్టికాండకు వ్యతిరేకంగాఎంతో మంది హెచ్చరికలు చేస్తున్నారు. అయితే పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నవారు ఎవరూ కనిపిం చడం లేదు! ఈ కొత్త సంవత్సరంలో ఇతోధికంగా అభివృద్ధి చెందనున్న ఎఐ ఆధారిత పరిశ్రమలకు మొట్టమొదటి సవాల్ సృజనాత్మక మేధోశ్రమ చేసే వారి నుంచే వస్తుంది.

మానవాళి విశిష్టత ఏమిటి? మానవుని విలక్షణతను ఎలా అర్థం చేసుకోవాలి? మానుషత్వాన్ని ఎలా నిర్వచించాలి? సహస్రాబ్దాలుగా సకల సమాజాలలోని విజ్ఞులు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఏ దివ్యశక్తి మానవుడిని జీవకోటిలో ప్రత్యేకంగా నిలబెట్టింది? భాషా? చింతనా సామర్థ్యమా? ఆత్మీయ సమూహం, సొంత సమాజం సమష్టి అనుభవాలను పదిలపరచి భావి తరాలకు అందివ్వడమా? కృత్రిమ మేధ మౌలికతను ప్రశ్నిస్తున్న సవాళ్లు, ఆ అతి నవీన సాంకేతికత తీరుతెన్నులపై ఆక్షేపణల నుంచి అంతిమంగా ఆ ప్రశ్నలకు నిశ్చితమైన, నిర్ణయాత్మకమైన సమాధానాలు లభించే అవకాశమున్నది. మేధో నైపుణ్యాలు విలువకట్టలేని మానవ సంపద. తమ సృజనశీలతను రక్షించుకునే విషయంలో మానవులు ఎటువంటి రాజీకి అంగీకరించరు.

మానవ సృజనాత్మకత వెల లేనిది. వెల నిర్ణయించేందుకు ఎవరూ సాహసించలేనిది. పాత్రికేయ ప్రజ్ఞ ఆ సృజనాత్మకత ఫలితమే. కనుకనే దశాబ్దాలుగా ఆ ప్రజ్ఞతో తాము సంచితం చేసిన విజ్ఞాన, సమాచార భాండారాన్ని తన సొంతం అన్నట్టుగా చాట్ జిపిటి వినియోగించుకోవడాన్ని విఖ్యాత మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్’ నిరసిస్తోంది. అనిర్దిష్ట మొత్తంలో వందల కోట్ల డాలర్లను తమకు చెల్లించి తీరాల్సిందేనని ఖండితంగా డిమాండ్ చేస్తూ ఆ అధునాతన సాంకేతికత ఉత్పత్తిదారులు అయిన ఎఐ కంపెనీలపై కోర్టులో దావా వేసింది. తమను ఇంత శక్తిమంతులుగా, అపర సృష్టికర్తలుగా చేసిన సృజనాత్మక శ్రమను ఇప్పుడు ఒక యంత్రానికి వదలివేసేందుకు మానవులు అంగీకరిస్తారా? అంగీకరించరు. ఎందుకంటే అలా యాంత్రిక బానిసలు కావడం వల్ల మానవ జీవితం ఎటువంటి మినహాయింపు లేకుండా పూర్తిగా అర్థరహితమై పోతుంది. మరి కింకర్తవ్యమేమిటి? ఈ ధరిత్రిపై నడయాడుతున్న సృజనశీలురు అందరూ కృత్రిమ మేధకు వ్యతిరేకంగా సమైక్యమవడమే.


l ప్రతీక్ కంజీలాల్

ఎడిటర్, ది ‘ఇండియా కేబుల్’


(ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యం)

No comments:

Post a Comment